Vermicompost : వర్మీ కంపోస్ట్ తయారీ…మెళకువలు
Vermicompost : మొక్కకు కావాల్సిన పోషకాలను అందించి మంచి దిగుబడులు పొందేందుకు భూమికి సేంద్రీయ ఎరువుల అవసరత ఎంతైనా ఉంది. భూములను సారవంతంగా మార్చటంలో ఇటీవలికాలంలో వర్మీ కంపోస్ట్ వినియోగం బాగా పెరిగింది. కృత్రిమ ఎరువుల కారణంగా కోల్పోయిన భూసారాన్ని తిరిగి సారవంతం చేయటంలో వర్మి కంపోస్ట్ కీలకపాత్ర పోషిస్తుంది. వ్యవసాయ వ్యర్ధాలను వానపాముల సహాయంతో కుళ్ళబెట్టి వర్మి కంపోస్ట్ ను ఉత్పత్తి చేస్తున్నారు.
వర్మీ కంపోస్ట్ తయారీ ప్రస్తుతం వాణిజ్య సరిళిగా మారింది. చాలా మంది వర్మికంపోస్ట్ ను తయారు చేసి రైతులకు విక్రయిస్తున్నారు. సేంద్రీయ ఎరువుల్లో వానపాములతో తయారైన వర్మీకంపోస్ట్ ముఖ్యమైనది. పశువుల ఎరువుతో పోలిస్తే వానపాముల ఎరువులో నత్రజని, పాస్సరస్,పొటాషియం,కాల్షియం, మెగ్నీషియం, జింక్ ,కాపర్ వంటివి అధికంగా ఉంటాయి.
బొరియలు చేయని రకం వానపాములతో వర్మికంపోస్ట్ తయారీకి వినియోగిస్తున్నారు. అనుకూలమైన వాతావరణంలో బెడ్ లను నిర్మించుకుని అడుగుబాగంలో కాంక్రీట్ వేసుకోవాలి. వానపాములను భూమిలోకి వెళ్ళకుండా చూసేందుకు ఈ బెడ్ ఉపయోగపడుతుంది. బెడ్ లపై సూర్యరశ్మి పడకుండా షెడ్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కుళ్ళిన పశువుల పేడ, చెరకు ఆకులు, కొబ్బరి, అరటి, వంటి ఆకుల వ్యర్ధాలను బెడ్ లలో వేయాలి. బెడ్లలో రెండు వారాలపాటు నీరు చల్లుకుంటూ 40శాతం తేమ ఉండేలా చూసుకోవాలి.
చదరపు మీటరు విస్తీర్ణానికి 1500 వానపాములను బెడ్లలో వదులు కోవాలి. వానపాములను వదిలిన అనంతరం తేమ తగ్గకుండా బెడ్ లలో నీరు చల్లుకోవాలి. పాత గోనెసంచులు నీటితో తడిపి బెడ్ లపై పరుచుకోవాలి. 2 నుండి 3మాసాల వ్యవధిలోనే వర్మికంపోస్ట్ తయారవుతుంది. వర్మికంపోస్ట్ తయారైన తరువాత బెడ్ లలో నీరు చల్లటం ఆపేస్తే వానపాములన్నీ బెడ్ ల అడుగు బాగానికి చేరతాయి. ఆసమయంలో వర్మీకంపోస్టును జల్లెడ పట్టుకుని నీడలో ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది.
వర్మికంపోస్ట్ తయారీ సమయంలో కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి. బెడ్లలో ప్లాస్టిక్ పదార్ధాలను, పగిలిన గాజుముక్కలు, కోడిగుడ్డు పెంకులు, రాళ్ళు లేకుండా చూసుకోవాలి. బెడ్ ల చుట్టూ వలను ఏర్పాటు చేసుకోవాలి. పక్షులు, ఉడతలు, ఎలుకలు,కొంగలు వంటి వచ్చి వానపాములను తినకుండా రక్షణ అవసరం. పదిరోజులకు ఒకసారి పేడనీళ్ళు చల్లాలి. అధికంగా నీరు బెడ్లలో నిల్వ ఉండకుండా చూసుకోవాలి. రైతులు తమ పంటలకు అధిక ధరను చెల్లించి కృత్రిమ ఎరువులను కొనుగోలు చేసేకంటే వర్మికంపోస్టు తయారు చేసుకుని వినియోగించుకుంటే ఖర్చు తగ్గటంతోపాటు దిగుబడులు పెరుగుతాయి.
COMMENTS