Sajjasagu : సజ్జసాగు… విత్తన రకాలు
Sajjasagu : చిరు ధాన్యపు పంటల్లో సజ్జ ఒకటి.. ఇటీవలికాలంలో సజ్జ వినియోగం బాగా పెరుగుతుంది. సజ్జ చిరుధాన్యములో మన శరీరానికి అవసరమైన కాల్వియం,మెగ్నిషియం, ఇనుము, భాస్వరం వంటి పోషక విలువలు ఎక్కువ మొత్తంలో ఉండడంతోపాటు, డయాబెటిస్, ఉబకాయం వంటి వ్యాధిగ్రస్తులకు మంచి బలవర్థకమైన ఆహారం కావడంతో సజ్జ ధాన్యానికి దేశంలో రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. సాధారణంగా సజ్జ సాగును వర్షాభావ పరిస్థితులలోను, సకాలంలో ప్రధాన పంటను వేసుకోలేని సమయంగా స్వల్పకాలిక పంట అయిన సజ్జ పంటను వేస్తుంటారు. తేలికపాటి నుండి మధ్య రకం నేలలు మరియు నీరు ఇంకే మురుగు నీటి పారుదల గల నేలలు ఈ పంట సాగుకు అనుకూలం.
సజ్జ పంటనే ప్రధాన పంటగా సాగు చేయాలనుకుంటే ఖరీఫ్ సీజన్లో అయితే జూన్ – జూలై మొదటి వారంలో అదునుగా విత్తు కుంటే అధిక దిగుబడులు సాధించ వచ్చు. ఖరీఫ్‌లో వర్షాలు ఆలస్య మైనప్పుడు ఆగష్టు రెండవ వారం వరకు కూడ ఒక ప్రత్యామ్నాయ పంటగా విత్తుకొని మంచి దిగుబడులు సాధించవచ్చును. లేదా వేసవి పంట అయితే జనవరి మాసం సజ్జ పంటకు చక్కటి అనుకూలం. ఎకరానికి 1.5-2.0 కిలోల విత్తనం అవసరం అవుతుంది. వరుసల మధ్య 45 సెం.మీ., మొక్కల మధ్య 12-15 సెం.మీ. దూరం ఉండేటట్లు గొర్రుతో విత్తుకోవాలి.
సజ్జ సాగుకు సుమారు 400-450 మి.మీ. నీరు అవసరముంటుంది. ఖరీఫ్‌లో వర్షాధారంగా సాగు చేసినపుడు నీటి పారుదల అవసరం ఉండదు.20-25 రోజులకు మించి బెట్ట పరిస్ధితులు ఏర్పడితే, పూత దశ మరియు గింజ కట్టే దశలో నీటి తడులు ఇచ్చి మంచి దిగుబడులు సాధించవచ్చు. వేసవిలో సాగు చేసేటప్పుడు కూడా పూతదశ, గింజ పాలు పోసుకునే దశ మరియు గింజ గట్టి పడే దశల్లో నీటి తడులు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్‌లో సజ్జ పంట 2.03 లక్షల ఎకరాలలో సాగుచేస్తూ 82 వేలటన్నుల దిగుబడులను సాధిస్తున్నారు. సజ్జలో చాలా రకాలు ఉన్నప్పటికీ మన ప్రాంత వాతావరణానికి అనువైన విత్తన రకాన్ని ఎన్నుకోవడం మంచిది. సజ్జ విత్తనరకాల విషయానికి వస్తే…
సజ్జ విత్తన రకాలు:
డబ్ల్యు.సి.సి-75 (కాంపోజిట్) : పంటకాలం 85-90 రోజులు. దిగుబడి ఎకరాకు 8-10 క్వింటాళ్ళు. పైరు 180 సెం.మీ. ఎత్తు కుదురుకు 2-3 పిలకలు వేస్తుంది. కంకి పొడవు 25-30 సెం.మీ. కంకులు లావుగా ఉండి. గింజలు లావుగా బూడిద రంగులో వుంటాయి. వెర్రికంకి తెగులును తట్టుకుంటుంది . అన్ని ప్రాంతాలకు అనుకూలమని చెప్పవచ్చు. ఐ.సి.టి.పి.-8203 రకం పంటకాలం 80-85 రోజులు. దిగుబడి ఎకరాకు 8-10 క్వింటాళ్ళు. గింజలు లావుగా,తెల్లగా వుంటాయి. వెర్రికంకి తెగులును , బెట్టను తట్టుకుంటుంది.
ఐ.సి.యమ్.వి-221 రకం పంటకాలం 85-90 రోజులు.దిగుబడి ఎకరాకు 8-10 క్వింటాళ్ళు. వెర్రికంకిని తట్టుకోగల కాంపోజిట్ రకం. అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది. పి.హెచ్.బి – 65 రకం పంటకాలం 77-81 రోజులు. దిగుబడి ఎకరాకు 10-12 క్వింటాళ్ళు. పైరు 200 సెం.మీ. ఎత్తు ఎదిగి ఆకుపచ్చగా ఉండి పశుగ్రాసమగా ఉపయోగపడుతుంది. ఐ.సి.యమ్.హెచ్ – 356 రకం పంటకాలం 85-90 రోజులు. దిగుబడి ఎకరాకు 8-10 క్వింటాళ్ళు. పైరు 150 సెం.మీ. ఎత్తు ఎదిగి కంకులు బూడిద రంగులో వుంటాయి. మల్లికార్జున రకం విషయానికి వస్తే పంటకాలం 80-85 రోజులు.దిగుబడి ఎకరాకు 8-10 క్వింటాళ్ళు. వర్షాభావ పరిస్తితులకు తట్టుకుంటంది.
ఐ.సి.యమ్.హెచ్ – 451 రకం పంటకాలం 85-90 రోజులు.దిగుబడి ఎకరాకు 8-10 క్వింటాళ్ళు. పైరు 180 సెం.మీ. సంకర రకం. పైరు 175 సెం.మీ. ఎత్తు ఎదిగి, 2-3 పిలకలు వేస్తుంది. గింజలు మద్యస్థ లావుగా బూడిద రంగులో ఉంటాయి. వెఱ్రికంకి తెగులును తట్టుకుంటుంది. అన్ని ప్రాంతాల్లో వేసుకోవచ్చు. యమ్.ఎల్.బి.హెచ్ – 322 రకం పంటకాలం 75-80 రోజులు. దిగుబడి ఎకరాకు 10-11 క్వింటాళ్ళు. పైరు రెండు మీటర్లు ఎత్తు పెరిగి రెండు లేదా మూడు కంకులు కలిగి పశుగ్రాసంగా వినియోగించుకోవచ్చు.
COMMENTS