Pomegranate Peel : దానిమ్మ తొక్క వ్యర్ధాలతో కోళ్లకు పోషక సప్లిమెంట్
Pomegranate Peel : కోళ్ల పరిశ్రమకు దాణా ఖర్చు తడిసి మోపెడవుతుంది. దాణా ఖర్చు కారణంగా కోళ్ల పరిశ్రమ నిర్వాహణ చాలా మందికి కష్టతరంగా మారింది. కోళ్లకు తక్కువ ఖర్చులో దాణా , ఆరోగ్యకరమైన సప్లిమెంట్ లను తయారు చేసుకుని అందించగలిగితే పరిశ్రమలు నిలదొక్కుకోవటం సులభంగా ఉంటుంది. ఇటీవలి కాలంలో దానిమ్మ తొక్క వ్యర్ధాలతో కోళ్ల కు దాణాను తయారు చేస్తున్నారు. జ్యూస్ దుకాణాలు, పండ్ల రసాల ప్రాసెసింగ్ యూనిట్లు పెద్ద మొత్తంలో దానిమ్మ తొక్క వ్యర్ధాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ప్రాసెసింగ్ వేస్ట్ ను సేకరించి ప్రత్యేక సాంకేతికత సహాయంతో కోళ్ల కోసం సప్లిమెంట్లను తయారు చేస్తారు.
దానిమ్మ తొక్కలను నీడలో 4 రోజులు ఎండబెట్టి ముతక పొడిని తయారు చేస్తారు. ఇది దానిమ్మ తొక్క సారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే ముడి పదార్థం. పొడిని వేడి నీటితో గాజు పాత్రలో పోస్తారు, ఆపై ముడి సారాన్ని రెండుసార్లు ఫిల్టర్ చేస్తారు. ఈ విధంగా తయారుచేసిన దానిమ్మ తొక్క సారం సూర్యరశ్మికి దూరంగా చీకటి ప్రదేశంలో భద్రపరచాలి. దీన్ని తయారు చేసిన 48 గంటలలోపు ఉపయోగించాలి.దానిమ్మ తొక్కలలో పాలీఫెనాల్స్ అనే రసాయనం ఉంటుంది, ఇది చాలా ప్రయోజనకరమైనది.
దానిమ్మ తొక్కల సారం యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది. అంటే కోళ్లకు వ్యాధులను కలిగించే బ్యాక్టీరియా మరియు ఫంగస్‌ను తొలగించడానికి ఇది పనిచేస్తుంది. చౌకగా నీటిలో కరిగే ఫోలిఫెనాల్స్‌ను పొందేందుకు దానిమ్మ తొక్కలు అవసరం అవుతాయి. బ్రాయిలర్లు మరియు లేయర్ బర్డ్స్‌కు రోజూ దానిమ్మ తొక్క సారం ఇస్తే వాటి పనితీరు మెరుగుపడుతుంది. 100 లీటర్ల దానిమ్మ తొక్క సారాన్ని తయారు చేసేందుకు రూ.110 మాత్రమే ఖర్చవుతుంది. ఈ పద్దతిని అనుసరించటం ద్వారా కోళ్ల పెంపకంలో నిమగ్నమై ఉన్నవారు తమ ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు కోళ్ల ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకోవచ్చు.
COMMENTS