Pepper Cultivation : విశాఖ మన్యంలో అదాయవనరుగా మిరియాల సాగు
Pepper Cultivation : మిరయాల సాగుకు పెట్టింది పేరు కేరళ.. ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ మన్యంలో మిరియాలు పంట సాగవుతుంది. మన్యంలో పండుతున్న మిరియాలు కేరళ మిరియాలకు ఏమాత్రం తీసిపోవటంలేదు. దిగుబడితోపాటు నాణ్యత విషయంలోను మన్యం మిరియాలు ప్రముఖ స్ధానాన్ని ఆక్రమించాయి. ఎలాంటి క్రిమి సంహార మందులు వినియోగించకుండానే కాఫీ తోటల్లో అంతర పంటగా మిరియాలు సాగు చేస్తున్నారు.
కాఫీ తోటలతో ఎకరానికి 25వేల నుండి 40వేల వరకు అదాయం సమకూరుతుండగా, దానిలో అంతర పంటగా వేస్తున్న మిరియాల పంటతో 40వేల నుండి 60వేల వరకు అదనంగా అదాయం సమకూరుతుంది. ఈ ఏడాది ఒక్క మిరియాల పంట ద్వారానే 150 కోట్ల రూపాయల అదాయంన్ని మన్యంలోని గిరిజన రైతులు ఆర్జించారు. మిరియాల సాగుకు మన్యం ప్రాంతం బాగా అనుకూలంగా ఉండటంతో ఇక్కడి గిరిజన రైతులకు మంచి అవకాశం గా మారింది.
ప్రస్తుతం 98వేల ఎకరాల కాఫీ తోటల్లో అంతరపంటగా మిరియాలు పంట సాగవుతుంది. కొండ వాలు ప్రాంతాలు సాగుకు అనుకూలంగా ఉంటున్నాయి. గిరిజనాబివృద్ధి సంస్ధ గిరిజన రైతులను మిరియాల సాగువైపు ప్రోత్సహిస్తోంది. కాఫీతోటల్లో నీడనిచ్చే సిల్వర్ ఓక్ చెట్ల వద్ద మిరియాల మొక్కలు నాటుతున్నారు. ఎకరాకు 60 నుండి 70 కిలోల వరకు దిగుబడి వస్తుంది. మార్కెట్లో కిలో మిరియాల ధర 500 నుండి 600 రూపాయలు పలుకుతుంది.
ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో దాదాపు 4 వేల మెట్రిక్ టన్నుల మిరియాల దిగుబడి వచ్చింది. 3.2 కిలోల పచ్చి మిరియాలను ఎండబెడితే ఒక కిలో ఎండు మిరియాలు వస్తాయి. ఈ లెక్కన గిరిజన రైతులకు దాదాపు రూ. 150 కోట్ల వరకూ అదనపు ఆదాయం మిరియాలతో సమకూరింది. ప్రస్తుతం కరియా ముండ, పన్నియూరు1 అనే రకాల మిరియాలు సాగవుతున్నాయి. అధిక దిగుబడి, నాణ్యమైన ఉత్పత్తిని ఇచ్చే మేలు రకాల మొక్కల ను కోజికోడ్ లోని భారత సుగంధ ద్రవ్యాల పరిశోధన సంస్థ నుంచి తీసుకొచ్చి చింతపల్లిలో నర్సరీల్లో అభివృద్ధి చేస్తున్నారు.
COMMENTS