Mango : మామిడి పూత దశలో జాగ్రత్తలు,.. సస్యరక్షణ చర్యలు..
Mango : మామిడి పూత సాధారణంగా డిసెంబర్ – జనవరి నెలల్లో మొదలై ఫిబ్రవరి వరకు పూస్తుంది. ఎనిమిది నెలల పాటు చేపట్టే యాజమాన్య పద్ధతులు ఒక ఎత్తయితే పూత నుంచి కోత వరకు నాలుగు నెలల పాటు చేపట్టే పద్ధతులు మరో ఎత్తు. మామిడిలో పూతంతా ఒకేసారి రాదు. దీంతో మాసం మొత్తం పూత కాలంగా ఉంటుంది. పూత ఒకేసారి రాకపోవడంతో సస్యరక్షణ చర్యలు చేపట్టడంలో, కోత కోయడంలో రైతులకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మామిడి తోటలను సాగుచేసే రైతులు పూతకు ముందు, పూత దశలో సరియైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన పూత ఆలస్యంగా రావడం మరియు ఒకేసారి రాకపోవడం వంటి పరిస్థితులను గమనించడం జరుగుతుంది.
మామిడిలో పూత సాధారణంగా డిసెంబర్ నెల ఆఖరి వారంలో వస్తుంది. డిసెంబరు నెలాఖరున పూమొగ్గలు బయటికి వచ్చి, పూత అంతా కూడా రావటానికి జనవరి నెల ఆఖరి వరుకు సమయం పడుతుంది. కాబట్టి పూత, కోత మొదలైన తర్వాత సస్యరక్షణ చర్యలు చేపట్టడం సరికాదని, పూత రావడానికి కొన్ని రోజుల ముందు నుంచి తోటను గమనించి పూర్తి స్థాయిలో యాజమాన్య చర్యలు తీసుకోవడం వల్ల మంచి దిగుబడులను పొందవచ్చును. నవంబర్ నెల నుంచి జనవరి వరకు కొమ్మ కత్తిరింపులు కానీ, దున్నడం కానీ చేయకుండా మామిడి తోటలని చెట్లకు విశ్రాంతి ఇవ్వాలి. ఈ సమయంలో చెట్టుకు అంతరాయం కలిగించినట్లయితే పూత రావడం ఆలస్యమవడం కానీ లేదా పూత రాకుండా ఉండడం కానీ జరిగి దిగుబడులు తగ్గే అవకాశం ఉంది.
మామిడిలో పూత చాలావరుకు వాతావరణ పరిస్థితుల పైన , రైతులు చేపట్టే యాజమాన్య చర్యలపైన ఆధారపడి ఉంటుంది. సాధారణంగా జూలై – ఆగష్టు నెలలో మామిడి చెట్లకు వచ్చిన ఇగుర్లు ముదిరి ఆ రెమ్మల్లో పూత డిసెంబర్ చివర లేదా జనవరి మాసంలో వస్తుంది. మామిడి పూత రావడానికి ముందు రెండు నెలలు బెట్ట పరిస్థితులు అవసరం, అదే విధంగా వాతావరణ పరిస్థితులు ముఖ్యంగా డిసెంబర్ మాసంలో సగటు ఉష్ణోగ్రత 18 – 28° సెంటిగ్రేడ్ & రాత్రి ఉష్ణోగ్రత 10 – 13° సెం.గ్రే. ఉంటే పూత రావడానికి అనుకూలం. ఈ పరిస్థితుల్లో తేడాలొస్తే పూత రావడంలో మార్పులు ఉంటాయి. కాబట్టి పూతకు ముందు రెండు నెలలు తోటలకు నీటి తడులు ఇవ్వడం పూర్తిగా నిలిపివేయాలి. పూతకు ముందు భూమిలో తడి ఉంటే చెట్లలో పూతకు బదులు ఆకు ఇగుర్లు వచ్చేస్తాయి. డిసెంబర్ చివరిలో పూత వచ్చిన అనంతరం ప్రతి 10 నుంచి 15 రోజులకు ఒకసారి భూమిలో తేమను బట్టి క్రమం తప్పకుండా నీటి తడులు ఇవ్వాలి.
నవంబర్, డిసెంబర్ మాసాల్లో చలి వాతావరణం మరీ ఎక్కువగా ఉన్నప్పుడు పూ మొగ్గలు రావడం ఆలస్యమవుతుంది. ఈ పరిస్థితులు ఉన్నప్పుడు పూ మొగ్గలను ఉత్తేజపరిచేందుకు డిసెంబర్ రెండవ పక్షంలో లీటరు నీటికి 10గ్రా. మల్టి – కె ( పొటాషియం నైట్రేట్) + 5 గ్రా. యూరియా చొప్పున కలిపి చెట్లపై రెమ్మలు బాగా తడిచేలా పిచికారి చేయాలి. యూరియా, మల్లి – కె లోని నత్రజని, పోటాష్ పోషకాలు కలిసి పూ మొగ్గలను ఉత్తేజపరిచి , బాగా పూత రావడానికి అధికంగా పిండి కట్టడానికి మరియు కాయలు మంచిసైజులో, నాణ్యంగా ఎదగడానికి సహకరిస్తాయి.
పూత దశలో ఎక్కువగా బూడిదరంగు తెగులు ఆశిస్తుంది. లేత ఆకులు, పూత కాండం, పూలమీద, చిరు పిందెల మీద తెల్లని పౌడర్ లాంటి బూజు చేరుతుంది. ఇదే బూడిద తెగులు. ఇది ఎక్కువగా రాత్రిపూట చల్లగా, పగలు వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఆశిస్తుంది. దీని వల్ల పూత, కాత రాలిపోతుంది. దీని నివారణ కోసం మొగ్గలు కనిపించే దశలో లీటరు నీటికి 3 గ్రాముల గంధకం కలిపి పిచికారీ చేయాలి. పూత దశలో తెగులు కనిపిస్తే హెక్బాకోనజోల్ 2 మి.లీ. లేదా ప్రాసికోనజోల్ ఒక మి.లీ. లేదా డినోకాఫ్ లేదా ట్రైడిమాల్స్ ఒక మి.లీ. నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఆకుపచ్చ, పూతమాడు, నల్లమచ్చ తెగుళ్లు మామిడి పూత సమయంలో ఆశిస్తాయి. వర్షాలు లేదా పొగమంచు అధికంగా ఉన్న సమయంలో ఈ తెగుళ్లు వ్యాపిస్తాయి. లేత ఆకులు, రెక్కలు, పూలను పండ్లను ఆశించి నష్టపరుస్తాయి. ఆకుల మీద గోధుమరంగులో మచ్చలు ఏర్పడి క్రమంగా మచ్చలు పెరిగిపోయి ఆకులు త్వరగా పండుబారి రాలిపోతాయి. రెమ్మలపైనా నల్లని మచ్చలు ఏర్పడి పూల గుత్తులు, పూలు మాడిపోతాయి. కాయలు రాలిపోతాయి. ఈ తెగులు నివారణ కోసం పూత దశకు ముందే ఎండిన కొమ్మలను కత్తిరించి తగులబెట్టాలి. లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా ఒక శాతం బోర్డో మిశ్రమం కలిపి పిచికారీ చేయాలి. 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పచ్చిపూత మీద ఒక గ్రాము కార్బండిజమ్, ఒక గ్రాము థయోఫినేట్ మిథైల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పిందె దశలో లీటరు నీటిలో 2.5గ్రాముల మండోజెల్ లేదా 2గ్రాముల ఆంట్రాకాల్ కలిపి పిచికారీ చేయాలి.
తేనెమందు పురుగులు ఆశించి పంటకు నష్టం కలిగిస్తాయి. తల్లి, పిల్ల పురుగులు గుంపులుగా చేరి లేత ఆకులను, పూత కాండాలు, పూలు, లేత పిందెల నుంచి రసం పీల్చుతాయి. లేత ఆకులను ఆశించినప్పుడు ఆకుల చివర్ల మాడిపోతాయి. పూత మాడిపోతుంది. పిందెలు బలహీనపడి రాలిపోతాయి. అంతేకాకుండా ఈ పురుగు తేనెలాంటి తియ్యని పదార్థాన్ని విసర్జిం చడం వల్ల ఆకులు, కాండలు, కాయలపై మసిపొర ఏర్పడుతుంది. వీటి నివారణకు 1.5 మి.లీ. మోనోక్రొటోఫాస్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పూత, మొగ్గ దశలో లీటరు నీటికి ఒక మి.లీ. డైక్లోరోఫాస్ లేదా 3గ్రాముల కార్పోరిల్ కలిపి చెట్టంతా తడిచేలా పిచికారీ చేయాలి. పచ్చపూత దశలో కాండలు బయటకు వచ్చి పూలు వికసించకుండా ఇంకా మొగ్గ దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 2 మి.లీ. మోనోక్రొటోపాస్, లేదా డైమిథోయేట్, లేదా 3 మి.లీ. జిథైల్‌డెమాటాన్, లేదా0.25మిల్లిలీటర్ల ఇమిడాక్లోపిడ్ పిచికారీ చేయాలి.
COMMENTS