నవ్వుకు రోగాలను తగ్గించే శక్తి ఉందా?
Laughter : ఔను ఇది నిజం. నవ్వు ఒక బలమైన ఔషధంలాంటిది. శరీరంలో ఆరోగ్యకరమైన శారీరక, భావోద్వేగ మార్పులను ప్రేరేపించే మార్గాల్లో నవ్వును చెప్పవచ్చు.
నవ్వు మీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది, మానసిక స్థితిని పెంచుతుంది. నొప్పిని తగ్గిస్తుంది. ఒత్తిడి వంటి హానికరమైన ప్రభావాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.మనస్సు,శరీరాన్ని తిరిగి సమతుల్యతలోకి తీసుకురావడానికి మంచి నవ్వు కంటే మరోమార్గం లేదు. హాస్యం అనేది శరీర భారాలను తేలికపరుస్తుంది. ఆశను ప్రేరేపిస్తుంది, మిమ్మల్ని ఇతరులతో కలుపుతుంది. ఏకాగ్రతతో , అప్రమత్తంగా ఉంచుతుంది. కోపాన్ని వదిలించుకోవడానికి సహాయపడుతుంది.
చిన్నప్పుడు, మనం రోజుకు వందల సార్లు నవ్వుతుంటాం, కానీ పెద్దయ్యాక, జీవితం అనేక ఆటుపోట్లకు లోనవుతుంటుంది. ఆసమయంలో నవ్వు చాలా అరుదుగా ఉంటుంది. కానీ హాస్యం, నవ్వు తో మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు, సంబంధాలను బలోపేతం చేసుకోవచ్చు, గొప్ప ఆనందాన్ని పొందవచ్చు. నవ్వు నాలుగువిధాలుగా చెడు అని పూర్వము అనేవారు. ఇప్పుడు నవ్వు నాలుగు విధాలుగా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
నలుగురి తో కలిసి కబుర్లు చెప్తూ నవ్వుతూ ఉండే వారిలో ఎండార్ఫిన్స్ అనే హార్మోనులు ఉత్పత్తి అవుతాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నవ్వు మంచి మందులా పనిచేస్తుందని, తరచుగా నవ్వుతూ గడిపేవాళ్లు మరింత ఆరోగ్యంగా ఉంటున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. నవ్వినపుడు మన శరీరంలో ఉండే కండరాలు సాగుతాయి. నాడి కొట్టుకోవటం, రక్తపోటు పెరుగుతుంది. శ్వాస వేగంగా తీసుకోవటం వంటివి జరుగుతాయి. దీంతో మెదడుకు, కణజాలానికి ఆక్సిజన్ సరఫరా అవుతుంది.
నవ్వు ఇన్‌ఫెక్షన్లతో పోరాడే యాంటీబోడీల స్థాయులు పెరగటానికి తోడ్పడుతున్నట్టు, రోగనిరోధక కణాల మోతాదులనూ పెంచుతుంది. భోజనం చేసిన తర్వాత హాస్య సన్నివేశాలను చూసిన మధుమేహుల రక్తంలో గ్లూకోజు స్థాయులు తగ్గినట్టు ఒక అధ్యయనంలో తేలింది. ధ్యానం మాదిరిగానే నవ్వు కూడా మెదడులో గామా తరంగాలను ప్రేరేపిస్తుంది. నవ్వు తేలికపాటి వ్యాయామంతో సమానంగా లాభాలు చేకూరుస్తున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. 10-15 నిమిషాల సేపు నవ్వితే 50 కేలరీలు ఖర్చవుతుందట.
ఒక మంచి, హృదయపూర్వకమైన నవ్వు శారీరక ఒత్తిడిని తగ్గిస్తుంది, తర్వాత 45 నిమిషాల వరకు మీ కండరాలు రిలాక్స్‌గా ఉంటాయి. నవ్వు రక్త నాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. రక్త ప్రవాహాన్ని పెంచుతుంది, ఇది గుండెపోటు ఇతర హృదయ సంబంధ సమస్యల నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది. నవ్వు మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. క్లిష్ట పరిస్థితులు, నిరాశలు మరియు నష్టాల నుండి సానుకూల, ఆశావాద దృక్పథాన్ని ఇవ్వటంలో హాస్యం మీకు సహాయపడుతుంది.
COMMENTS