Lady Fingers: బెండ అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన యాజమాన్యం
Lady Fingers: బెండ పంట వేసుకునేందుకు అన్ని కాలాలు అనుకూలమే. తక్కువ నీటితో ఆరుతడిగా పండించుకునే పంటల్లో ఇదొకటి. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో రైతులు బెండను విత్తారు. నూటికి 90 శాతం మంది రైతులు హైబ్రిడ్ బెండ రకాలపై ఆధారపడుతున్నారు కాబట్టి, పోషక యాజమాన్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. బెండలో అధిక దిగుబడులు సాధించడం కోసం చేపట్టాల్సిన ఎరువుల యాజమాన్యం గురించి, ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞానం కేంద్రం శాస్త్రవేత్త డా. క్రిష్ణవేణి విలువైన సూచనలిస్తున్నారు.
బెండ ఏడాది పొడవునా సాగయ్యే పంట. 4 నెలలు కాలపరిమితి కలిగిన ఈ పంటలో హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి వచ్చాక, రైతులు ఎకరాకు 50 నుంచి 100 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. ఏడాదిలో ఎక్కువ రోజులపాటు మార్కెట్ ధర నిలకడగా కొనసాగటం వల్ల రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఈ పంటలో పల్లాకు తెగులును తట్టుకునే రకాలు, హైబ్రిడ్ లు అందుబాటులో వుండటంతో రైతులు స్థిరమైన ఆదాయం గడించే అవకాశం ఏర్పడింది.
ప్రస్థుతం (రబీలో )విత్తిన పంట వివిధ దశల్లో వుంది. సకాలంలో పోషకాలు అందించి యాజమాన్యంలో తగిన మెళకువలు పాటిస్తే మంచి దిగుబడి సాధించవచ్చని సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. క్రిష్ణ వేణి.
బెండలో ప్రధానంగా రసం పీల్చు పురుగుల నివారణ పట్ల రైతులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ తెగులు వ్యాప్తి వుండదు. ప్రతి వారం 10 రోజులకు ఒకనీటి తడి అందిస్తే నాటిన 45వ రోజు నుంచి బెండ దిగుబడి ప్రారంభమవుతుంది. సకాలంలో పోషకాలు అందించినప్పుడు పైరు ఆరోగ్యంగా, అధిక వ్యాధి నిరోధక శక్తితో పెరిగి దిగుబడినిచ్చే కాలం పెరుగుతుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో బెండకు 20 రూపాయల ధర రైతుకు లభిస్తోంది. మార్కెట్ కు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించుకొని, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తే బెండ సాగులో.. అధిక దిగుబడులను పొందవచ్చు.
COMMENTS