Guava Cultivation : జామ సాగులో సస్యరక్షణ , తెగుళ్ళు..
Guava Cultivation : తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో జామ సాగు చేపడుతున్న రైతుల సంఖ్య బాగా పెరిగింది. జామ పండ్లలో అధిక పోషకాలు ఉండటంతో వీటిని ఆహారంగా తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈక్రమంలో మార్కెట్లో జామకు మంచి డిమాండ్ ఉండటంతో రైతులు జామ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. జామ సాగు చేపట్టే రైతాంగం చీడపీడల నుండి పంటను కాపాడుకుంటే ఆశించిన మేర పంట దిగుబడిని పొందవచ్చు. ఇందుకోసం సరైన యాజమాన్యపద్దతులు, సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
జామ సాగులో ప్రధానంగా రైతులు పండు ఈగతో పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. పండు ఈగ జామ పంటను ఆశించి పంటకు తీవ్రనష్టాన్ని కలిగిస్తుంది. పక్వదశలో ఉన్న కాయల్లోని మెత్తని చర్మంలో పెడతాయి. గుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు కాయలోకి చొచ్చుకుని పోయి గుజ్జును తినేస్తాయి. పండు ఈగ ఆశించిన జామతోటల్లో కాయలు రాలిపోతుంటాయి. ఇలాంటి సందర్భంలో 2మి.లీ మిథైల్ యూజినాల్, 3గ్రా కార్బోప్యూరాన్ 3జి గుళికలను లీటరు నీటిలో కలిపి ద్రావణంగా తయారు చేసి ప్లాస్టీక్ సీసాల్లో 200 మి.లీ ద్రావణాన్ని నింపి వాటిని తోటలో అక్కడక్కడ కొమ్మలకు వేలాడదీయాలి. మగఈగలు ద్రావణానికి ఆకర్షితులై అందులో పడి చనిపోతాయి.
పిండి నల్లి జామపంటను ఆశించి తీవ్ర నష్టం కలుగచేస్తుంది. తోటల్లో తేమ అధికంగా ఉండడం, చెట్ల మధ్య దూరం తక్కువగా ఉండడం, నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండడం లాంటి పరిస్థితుల్లో ఈ పిండినల్లి సమస్య ఎక్కువగా ఉంటుంది. కాయలు,కొమ్మలను ఆశించి రసాన్ని పీలుస్తాయి. జిగురు పదార్గాన్ని విసర్షించడం వలన మసి తెగులు వస్తుంది. తద్వారా కిరణజన్య సంయోగ క్రియ జరగక, మొక్కల పెరుగుదల తగ్గి, కాపు తగ్గిపోతుంది.దీని నివారణకి అక్షింతల పురుగు బదనికలను తోటలో విడుదల చేయాలి. ఎసిఫేట్ 1 గ్రా. లేదా డైక్లోరోవాస్ 1 మి.లీ. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
కాండం తొలిచే పురుగు జామతోటలకు నష్టాన్ని కలుగజేస్తుంది. చెట్ల మొదళ్ళ నుండి కాండంలోనికి తొలుచుకొని పోయి నష్టం కలిగిస్తుంది. కాండం లోపల ఉండే కణజాలాన్ని తినేస్తాయి. దీనికారణంగా చెట్టు మొత్తం చనిపోయే అవకాశం ఉంటుంది. దీని నివారణకి పురుగు చేసిన రంధ్రాలని శుభ్రపరిచి ఇనుపచువ్వ సహాయంతో పురుగును చంపి తర్వాత రంధ్రాల్లో పెట్రోలు లేదా కిరోసిన్లో తడిపిన దూదిని ఉంచిగానీ లేదా కార్బోఫ్యూరాన్ గుళికలు వేసి రంధ్రాలను తడపాలి. అనంతరం ఆ రంధ్రాలను రేగడి మట్టితో పూడ్చాలి.
తెల్లదోమ పిల్ల పురుగులు జామ ఆకులపై తెల్లని దూదివంటి మెత్తని పదార్థంతో కప్పటం ద్వారా ఆకుల రసాన్ని పీలుస్తాయి. ఇవి ఆశించిన ఆకులు ఎర్రబడి ముడతలు పడతాయి. దీని నివారణకి, రాత్రులందు జిగురు పూసిన పసుపు రంగు డబ్బాలను తోటలో ఉంచాలి. ప్రథమ దశలో పురుగు ఆశించిన కొమ్మలను కత్తిరించి, వేపనూనెను 5 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వీటి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే ఫాస్పామిడాన్ లేదా డైక్లోరోవాస్ లేదా హెూస్థా థయాన్ 1 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే తెల్లదోమను నివారించుకోవచ్చు.
COMMENTS