Drumsticks Cultivation : మునగసాగులో సస్యరక్షణ చర్యలు
Drumsticks Cultivation : రైతులు వాణిజ్య శైలిలో మునగ సాగు చేపట్టి స్వల్ప కాలంలో అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. నీటి వసతిగల ప్రాంతాల్లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఇది ఉష్ణమండలపు పంట కనుక వేడి, పొడి వాతావరణం బాగా అనుకూలం. మునగ సాగును రైతులు అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు అయితే ఎక్కువగా నీరు నిలిచే పరిస్థితులను తట్టుకోలేదు. సాధారణంగా మునగ చెట్లు జనవరి నెలలో పూతకు వచ్చి, ఫిబ్రవరి మాసం నుంచి కాయ కోతకు వస్తుంది. చీడపీడల విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే రైతులకు మంచి దిగుబడులు పొందవచ్చు.
చీడపీడలు సస్యరక్షణ:
కాండం కుళ్లు మరియు వేరు కుళ్లు తెగులు : మురుగు నీరు ఎక్కువగా నిలిచే భూముల్లో వర్షాకాలంలో ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. కాండం చుట్టూ ఉన్న బెరడు కుళ్ళిపోయి చెట్టు విరిగిపోతుంది. ఈ తెగులు వేరుకు వ్యాపిస్తే వేర్లు కుళ్లిపోయి చెట్టు చనిపోతుంది. దీని నివారణకు లీటరు నీటిలో 1గ్రాము కార్బండైజిమ్ లేదా 3గ్రాముల డైథేన్ ఎం45 కలిపిన ద్రావణం కానీ లేదా 1శాతం బోర్డోమిశ్రమాన్ని మొక్కల మొదలు దగ్గర పోసి వ్యాధిని నివారించవచ్చు.
ఆకు తినే పురుగు; ఈ పురుగు ఉధృతి డిసెంబర్, జనవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో కనిపిస్తుంది. దీని పిల్ల పురుగులు ఆకుపచ్చ రంగులో ఉండి ఆకులను తింటూ నష్టాన్ని కలిగిస్తాయి. తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే క్వినాల్ ఫాస్ 2 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి నష్టాన్ని అరికట్టవచ్చు.
గొంగళి పురుగు : మునగ పంటను అన్ని దశల్లోనూ తీవ్ర నష్టం కలిగిస్తాయి.రాత్రి వేళల్లో గొంగళి పురుగులు ఆకులను తింటూ బెరడును కూడా గీకటం ద్వారా నష్టాన్ని కలుగుజేస్తాయి. గొంగళి పురుగు నివారణకి తల్లి రెక్కల పురుగు పెట్టిన గుడ్ల సముదాయాలను, గొంగళి పురుగు సమూహాలను ఏరి నాశనం చేయాలి.పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే 2 మి.లీ క్వినాల్ ఫాస్ ఒక లీటరు నీటిలో కలిపి15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి . చెట్టుచుట్టూ కార్బోఫ్యురాన్ 3 జి గుళికలు 15-30 గ్రా , వేసుకుని మట్టితో కప్పడం వల్ల కోశస్థ దశలో ఉన్న గొంగళి పురుగును నివారించటం సాధ్యమౌతుంది.
తామర పురుగులు : మొక్కలు లేత దశలో ఉన్నప్పుడు మొక్క చిగుళ్ళ నుంచి రసం పీల్చడం వల్ల కొత్త చిగుర్లు సరిగ్గా రాక మొక్కలు గిడసబారి పూత ,కాయ ఏర్పడదు. ఈ పురుగు నివారణకు 2 మి.లీ మెటాసిస్టాక్స్ లేదా 1 గ్రా . ఎసిఫేట్ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి
కాయతొలిచే ఈగ : ఈగ జాతికి చెందిన పురుగులు. ఇవి పూత దశలో ఆశిస్తాయి. పిల్ల పురుగులు పిందె దశలో కాయలోనికి ప్రవేశించి లోపలి పదార్థాన్ని తిని నాశనం చేస్తాయి. అందువలన మునగ కాయుల ఆకారం మారిపోయి వంకరగా తయారవుతాయి. కాయ దశలో ఈగ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. సరైన సమయంలో నివారణ చర్యలు చేపట్టాలి. లేకుంటే పిందె దశలో కాయలోనికి ప్రవేశించి, లోపలి పదార్థాన్ని తిని నాశనం చేస్తాయి. కాయతొలిచే ఈగ నివారణకు పూత దశలో లీటరు నీటికి 2 మి.లీటర్ల ఫాసలన్ కలిపి పిచికారీ చేయాలి. పిందె దశలో లీటరు నీటికి 1మి.లీటరు డైక్లోరోవాస్ కలిపి మళ్లీ పిచికారీ చేయాలి. ఈగ ఉద్ధృతి మరీ ఎక్కువగా ఉంటే 20 రోజులకు మరోసారి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది.
COMMENTS