Coconut : కొబ్బరిలో కొమ్ము పురుగు….నివారణ
Coconut : కోనసీమ, కోస్తా ప్రాంతాలలోనే తెలుగు రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో కొబ్బరి పంట సాగు చేస్తున్నారు. ఇటీవలికాలంలో కొత్తగా నాటిన కొబ్బరి తోటలను కొమ్ముపురుగు ఆశించి ఎక్కువగా నష్టపరుస్తుంది. ఈ కొమ్ము పురుగు ఆశించిన తరువాత ఎర్రముక్కు పురుగు, మొవ్వు కుళ్ళు ఆశించే అవకాశం ఉండి చెట్టు చెడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొమ్ము పురుగును నివారంచేందుకు రైతులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లేకుంటే కొబ్బరి తోటకు నష్టం వాటిల్లుతుంది. ఇందుకోసం సరైన సస్యరక్షణ చర్యలను చేపట్టటం మంచిది.
కొమ్ము పురుగు ఆశించిందా లేదా అన్ని విషయాన్ని కొబ్బరిలో కొన్ని లక్షణాల ద్వారా సులభంగా గుర్తించవచ్చు. విప్పారిన ముదురు ఆకులపై vఆకారములో కత్తిరించినట్లు ఉంటుంది. కొబ్బరిచెట్టు మొవ్వులో పురుగు తొలచిన రంధ్రము, మొవ్వు భాగంలో పురుగు నమిలి విడిచి పెట్టిన పిప్పి ఉంటుంది. కొమ్ముపురుగు కొబ్బరి లేత మొవ్వు భాగము, పొత్తులను తొలుచుట వలన విప్పారిన లేత ఆకులు, పొత్తులు నష్టపోయి కొబ్బరి దిగుబడులు తగ్గే అవకాశం ఉంది.
చిన్న మొక్కలలో ఈ పురుగు ఆశించి, మొవ్వు దెబ్బతిని మొక్క చనిపోయే ప్రమాదము కూడా ఉంది. అంతేగాక కొమ్ముపురుగు ఆశించిన మొక్కల మొవ్వు వంకర తిరిగి ఉంటుంది. ఈ పురుగు ప్రత్యక్షంగానే కాక, పరోక్షంగా కూడా నష్టము కలుగజేసే అవకాశం ఉంది. ఈ పురుగు ఆశించిన చెట్లు మొవ్వుకుళ్ళు బారిన పడిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేగాక కొమ్ము పురుగు నష్టపరిచిన మొవ్వుభాగము నుండి వచ్చే పులిసిన నాసినకు కొబ్బరి కాండము తొలిచే ఎర్రముక్కు పురుగు ఆశించి నష్టము కలుగజేసే ప్రమాదమున్నది.
నివారణ చర్యలు ;
తోటలలో పడిపోయిన చెట్లను తొలగించి వాటిని నాశనము చేయాలి. పడిపోయిన చెట్ల మొదళ్ళు భూమిలో ఉన్న భాగాన్ని త్రవ్వించి, తగుల బెట్టించాలి. తోటలో పశువుల ఎరువు కుప్పలు ఉంచరాదు. దగ్గరలోని పశువుల ఎరువు కుప్పలను 3 నెలలకొకసారి తిరగేస్తూ, వివిధ దశలలో ఉన్న కొమ్ము పురుగులను తీసి నాశనం చేయాలి. మూడు నెలలకొకసారి కొబ్బరి చెట్ల మొవ్వలలో,ఆకు వలయాలలో వేప పిండి లేక వేపగింజల పొడి 100 గ్రాములు,130 గ్రాములు ఇసుకలో కలిపి చల్లాలి.
మెటరైజియమ్ ద్రావణాన్ని మూడు ఘనపు మీటర్ల కుప్పకు ఒక లీటరు ద్రావణము లీటరుకు 5 గ్రాములు చొప్పున చల్లి, మెటరైజియమ్ బూజు తెగుళ్ళను,పురుగు ఉధృతి కేంద్రాలైన పశువుల పెంట, వ్యర్ధ సేంద్రీయ పదార్ధాల కుప్పంలో వ్యాప్తి చేయాలి. కొమ్ము పురుగును ఆకర్షించు రైనోల్యూక్ అనే ఫిరమోన్ ఎరలను బక్కెట్లో పెట్టి 5 ఎకరముల తోటకు ఒకటి చొప్పున పెట్టి, వాటి లోపలికి తల్లిపురుగులు ఆకర్షితమైన తరువాత చంపాలి.2నుండి 4 సంవత్సముల లోపల వయస్సు గల కొబ్బరి మొక్కలలో కొమ్ముపురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఫెర్టరా గుళికలు 0.4 శాతం జి.ఆర్. క్లోరాన్ ట్రానిలిప్రోల్ 5నుండి10 గ్రాములను చిన్న పాలధీన్ సాచేట్ లలో కట్టి మొవ్వులో ఉంచాలి.
COMMENTS