Banana Tree Leaves: అరటి ఆకులతో అద్భుతమైన ఆదాయం
Banana Tree Leaves: అరటిపండు సంపూర్ణ పౌష్టికాహారం. అరటి ఆకులో భోజనం శ్రేష్టం. శుభ కార్యక్రమాలకు గుమ్మాల ముందు అరటి చెట్లను కడతారు. తమిళనాడు ప్రజలైతే ఎక్కువగా శుభ కార్యాలకు, హోటళ్లలో అరటి ఆకులను అధికంగా వినియోగిస్తారు. ఈ అవకాశాలను ఆసరాగా చేసుకొని ఆకుల కోసం అరటితోటల పెంపకానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు 15 ఏళ్లుగా ఆకుల కోసం అరటి సాగు చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.
అరటి తోట అనగానే అరటి గెలలు ఉంటాయనుకుంటున్నారా .. కాదు.. కాదు.. ఈ తోట కేవలం అరటి ఆకుల కోసమే. దీనిని సాగుచేస్తున్నది ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, వజ్జిరెడ్డిపాలేం గ్రామానికి చెందిన రైతు జాలి లింగారెడ్డి. 15 ఏళ్లుగా అరటి ఆకుల కోసమే సాగుచేసి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.
అరటి రైతులు కేవలం కాయలే కాకుండా ఆకులపై ఆదాయం పొందొచ్చని నిరూపిస్తున్నారు రైతు లింగారెడ్డి. తోట నాటిన 6 నెలల నుండి ఆకుల కోత ఉంటుంది. గెలల తోట మాదిరిగా పెట్టుబడులు ఉండవు. కేవల నీటి తడులు, నెలకు ఒక సారి కాంప్లెక్స్ ఎరువులు వేస్తే సరిపోతుంది. 6 నెలల తరువాత నుండి 7 నుండి 10 రోజులకు ఒక సారి ఆకుల కోత జరుగుతుంది.
అరటి పళ్లతో సమానంగా ఆకులపై రైతు లింగారెడ్డి ఆదాయం పొందుతున్నారు. సరైన సమయంలో పిలకలు కత్తిరించడం.. ఎరువులు వేస్తే ఆకులు బాగా ఎదుగుతాయి. మొక్క నాటిన ఆరు నెలల నుంచి ఆకుల కత్తిరింపు జరుగుతుంది. 4 సంవత్సరాల వరకు ఆకుల కత్తిరింపు అమ్మకాలు ఉంటాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే అరటి ఆకులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
ఒక్కో ఆకు వ్యాపారులు రూ. 1.30 పైసలనుండి రూ. 2 వరకు కొనుగోలు చేసి తీసుకెళుతున్నారు. ఈ తోటకు తొలి ఏడాది మాత్రమే పెట్టుబడులు ఉంటాయి. తరువాత అంతగా ఉండవు. రైతు లింగారెడ్డి ఏడాదికి ఎకరానికి రూ. 1 లక్షా 50 వేల నికర ఆదాయం పొందుతున్నారు.
COMMENTS