Bacterial Rot : దానిమ్మలో బాక్టీరియా తెగులు..నివారణ
Bacterial Rot : వాణిజ్య పరంగా పండించే పళ్ళలో దానిమ్మ ముఖ్యమైనది. అత్యంత ఔషద విలువలతో పాటు, రసాన్ని దానిమ్మ పండ్ల నుండి పొందవచ్చు. పండ్లచర్మం, రసం, ఆకులు మరియు వేర్లు అనేక రకాలైన ఆయుర్వేద మందుల తయారీకి ఉపయోగిస్తారు. ఈ పంటను కరువు ప్రాంతాలలో సైతం సాగు చేయవచ్చు. దానిమ్మను ఆశించు తెగుళ్ళలో బాక్టీరియా తెగులు అధిక నష్టాన్ని కలుగుజేస్తున్నది. ఇది క్శాంతోమోనాస్ ఆక్సోనోపోడిస్ బ్యాక్టీరియా వలన వ్యాప్తిస్తుంది. దేశం లో దానిమ్మ సాగు రైతులకు దానిమ్మ బ్యాక్టీరియా తెగులు ఒక పెద్ద సమస్యగా మారింది. దానిమ్మ లో బ్యాక్టీరియా తెగులు పండ్ల దిగుబడిని, నాణ్యతని తగ్గిస్తుంది. ఇది పండ్ల అమ్మకాల విలువను ప్రభావితం చేస్తుంది. రైతులు ఈ రోగ నివారణకై ఎన్నో మందులను వాడినప్పటికీ ఈ తెగులును అరికట్టలేక తోటలనే తొలగిస్తున్నారు.
బాక్టీరియా దానిమ్మ ఆకులను, కొమ్మలను, కాండము మరియు పండ్లను ఆశిస్తుంది. ఆకులపై అక్కడక్కడ నీటిలో తడిచిన చిన్నచిన్న మచ్చలు ఏర్పడి, మచ్చల చుట్టూ పసుపు రంగు వలయాలు వస్తాయి. ఇవి క్రమేపి ఒక దానితో ఒకటి కలసి పెద్దవై ఈ ఆకులు రాలిపోతాయి. నీటిలో తడిచిన మచ్చలు, కొమ్మల పైన , కాండము పైన , కాయల పైన కనిపిస్తాయి. కొమ్మలు, కాండముల పై మచ్చలు ఒకటి కలసి పెద్ద మచ్చలుగా ఏర్పడి అక్కడి కణజాలం కుళ్ళి విరిగిపోతాయి. అదే విధంగా కాయలపై అనేక సంఖ్యలో నీటిలో తడిచిన మచ్చలు ఏర్పడి క్రమేపి ఒక దానితో ఒకటి కలిసి పెద్దమచ్చలుగా ఏర్పడుతాయి. ఈ పచ్చల పై పెద్ద చీలికలు ఏర్పడి కాయలు కుళ్ళిపోతాయి.
నివారణా మార్గాలు ;
దానిమ్మ తోటలు నాటే ముందుగు మొక్కలు ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రోగ రహిత మొక్కలనే నాటుకునేందుకు ఎంచుకోవాలి. మొక్కలను 4×4 మీటర్ల దూరంలో నాటుకుంటే తెగులు వ్యాప్తి తగ్గించవచ్చు. కత్తిరింపులకు ఉపయోగించే కత్తెరలను డెటాల్ ,స్పిరిట్ , సోడియం హైపోక్లోరైడ్ 1% ద్రావణంలో ముంచి ఉపయోగించాలి. తెగులు సోకిన కొమ్మలను తెగులు సోకిన భాగం నుండి 2 ఇంచులు క్రిందకు కత్తిరించాలి. కత్తిరించిన భాగాలకు బోర్డో పేస్టు పూయాలి.
కత్తిరింపులకు ముందు ఆకురాల్చడానికి 5% యూరియా 50గ్రాములు లీటరు నీటికి లేదా ఇథైల్ 2.0 నుండి 2.5 మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. నేల పై రాలిన ఆకులను, తెగులు సోకిన కొమ్మలను, కాయలను తీసి కాల్చివేయాలి. చెట్ల పాదులలో బ్లీచింగ్ పౌడరును 8నుండి10 కేజీలు ఎకరాకు చల్లటం వల్ల రాలిన ఆకులలో ఉన్న బాక్టీరియా నశిస్తుంది. కత్తిరింపులు అయిన వెంటనే 1% బోర్డో మిశ్రమము పిచికారి చేయాలి. కత్తిరింపులు తరువాత వచ్చిన కొత్త చిగుర్ల పైన, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా అనగా ఆకాశము మేఘావృతమై అడపాదడపా వర్గాలు పడుతున్నప్పుడు , రోగ లక్షణాలు కనిపించిన వెంటనే కాఫరాక్సీక్లోరైడ్ 30 గ్రాములు, ప్రైప్టో సైక్లిన్ , కె. సైక్లిన్ , పౌషా మైసిన్ 5 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలిపి 10 రోజులు వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
పూత సమయంలో కాపరాక్సీక్లోరైడ్ కు బదులుగా కార్బండిజమ్ 1 గ్రాము 1 లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. సెప్టెంబర్ – అక్టోబర్ నెలలో కత్తిరింపులు చేసే పంటకు డిసెంబరు – జనవరి నెలలలో ఉష్ణోగ్రత తక్కువ ఉండి తెగులు తీవ్రత తక్కువగా ఉంటుంది. ప్రతి పంట తర్వాత 4 నుండి 5 నెలలు విశ్రాంతి నివ్వాలి. విశ్రాంతి సమయంలో కూడా మొక్కల పై 1% బోర్డో మిశ్రమం పిచికారి చేయాలి. దీనివల్ల రోగ తీవ్రతను తగ్గించవచ్చును. సిఫారసు చేసిన రసాయన ఎరువులను నత్రజని, భాస్వరం, పొటాష్ పశువుల ఎరువుతో కలిపి వాడాలి.
వీటితోపాటు సూక్ష్మ పోషకాలైన జింక్ సల్పేట్ 2 గ్రా, ఫెర్రస్ సల్పేట్ 2 గ్రా, మెగ్నీషియం సల్పేట్ 2 గ్రా., బోరిక్ యాసిడ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి చెట్ల పై పిచికారి చేయడం వలన చెట్టులో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.దానిమ్మకు నీటి అవసరం తక్కువ కనుక తగుమాత్రమే నీరు అందించాలి. ఎక్కువ నీరు ఇవ్వడం వలన కొత్త చిగుర్లు ఎక్కువగా వచ్చి బ్యాక్యీటరియకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతాయి.
COMMENTS