Backyard Poultry : నాటుకోళ్ళ పెంపకానికి అనువైన జాతికోళ్ళు ఇవే…
Backyard Poultry : ఇటీవలికాలంలో గ్రామీణ ప్రాంత రైతులు, నిరుద్యోగులు, మహిళలు పెరటి కోళ్ళ పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, ఎక్కవ లాభాలు ఉండటంతో ఆదిశగా ఆలోచన చేస్తున్నారు. కొద్ది పాటి స్ధలం, మెళుకువలు పాటిస్తే చాలు పెరటి కోళ్ళ పెంపకం లాభసాటి అదాయవనరుగా మార్చుకోవచ్చు. ఉన్న కొద్దిపాటి స్ధలాన్ని సద్వినియోగం చేసుకుని కోళ్ళ పెంపకం చేపట్టవచ్చు. అయితే ఇందుకోసం మేలుజాతి కోళ్ళను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. పెరటి కోళ్ల పెంపకానికి అనువైన రకాల గురించి తెలుసుకుందాం..
పెరటి కోళ్ళ పెంపకం ఆసక్తి కలిగిన వారు ముందుగా ఏజాతి కోళ్ళను పెంచాలో నిర్ణయించుకోవాలి. మేలు జాతి కోళ్ళలో వనరాజ, గిరిరాజా, స్వర్ణధార, గ్రామ ప్రియ, రాజశ్రీ, శ్రీనిధి, కడక్ నాధ్ వంటి రకాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. తక్కువ వయస్సులో మాంసానివ్వటంతోపాటు, ఎక్కవ గుడ్లు పెట్టే మేలు జాతి కోళ్ళుగా వీటిని చెప్పవచ్చు. మన పెరట్లో పెంపకానికి ఇవి అనుకూలంగా ఉంటాయి. ప్రమాదకరమైన వ్యాధులను సైతం ఈ కోళ్ళు తట్టుకుంటాయి.
వనరాజా కోళ్ళు; వీటిని హైద్రాబాద్ రాజేంద్రనగర్ డైరక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీవారు రూపొందించారు. పెరట్లో పెంపకానికి అనువైన రకం కోళ్ళు. అధిక సంఖ్యలో గ్రుడ్లు, మాంసాన్నిస్తాయి. రోగనిరోధక శక్తి ఎక్కువ గా ఉండటంతోపాటు, ఆకర్షణీయమైన రంగులో ఈకలను కలిగి ఉంటాయి. 10 నుండి 12 వారాల వయస్సులోనే పుంజులు మంచి బరువుకు వస్తాయి. 5నెలల వయసుకు 2.5కిలోల బరువు పెరిగి అధిక పోషకాలతో కూడిన మాంసాన్ని ఇస్తాయి. పెట్టకోడి సంవత్సరానికి 150 గ్రుడ్లను పెడుతుంది. వీటి కాళ్ళు పొడవుగా ఉండటం వల్ల కుక్కలు, పిల్లుల బారి నుండి త్వరగా తప్పించుకుంటుంది.
గిరిరాజా కోళ్ళు ; ఈ జాతి కోళ్ళను బెంగుళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రూపొందించారు. 3కిలోల నుండి 5కిలోల అత్యధికంగా బరువు పెరగటంతోపాటు, ప్రతి ఏటా 140 నుండి 170 గ్రుడ్ల వరకు పెడతాయి. దేశీయ కోళ్ళకన్నా రెండు రెట్లు అధిక బరువును కలిగి ఉంటాయి. పెరటికోళ్ళ పెంపకానికి ఇవి చాలా అనువైనవి. 2నెలల్లోనే ఏకంగా 3కేజిలకు పైగా ఈ కోడి బరువు పెరుగుతుంది.
రాజశ్రీ కోళ్ళు ; ఈ జాతి కోళ్ళను శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వారు రూపొందించారు. రోగ నిరోధక శక్తిని ఎక్కువగా కలిగి ఉంటుంది. 8 వారాల వయస్సులో 500 గ్రాముల బరువు పెరుగుతాయి. ఇరవై వారాల వ్యవధిలో 1.50 కిలోలకు పైగా బరువుఉంటాయి. 160 రోజుల వ్యవధిలోనే గ్రుడ్లు పెట్టటం ప్రారంభిస్తాయి. ఏడాదికి 170 గ్రుడ్లను పెడతాయి. ఈ కోడికి గ్రుడ్లను తనంతటతాను పొదిగే గుణం లేనందున ఇంక్యుబేటర్ సహాయంతో గ్రుడ్లను పొదిగించుకోవాల్సి ఉంటుంది.
శ్రీనిధి కోళ్ళు ; ఈ జాతికోళ్ళు గోధుమ రంగు వర్ణాన్ని కలిగి ఉంటాయి. నాటుకోడి గ్రుడ్లకు సమానంగా అధిక పోషకాలను కలిగి ఉంటాయి. ఏడాదికి 140 నుండి 160 గ్రుడ్లను పెడతాయి. అన్ని వాతావరణాలను తట్టుకుంటాయి. పొడవైన కాళ్ళతో, ఆకర్షణీయంగా ఉంటాయి. 5నెలల వయస్సు నుండే గ్రుడ్లను పెట్టటం ప్రారంభిస్తాయి. పెరటికోళ్ళు పెంచాలనుకునే వారికి అనుకూలమైనవి.
కడక్ నాథ్ కోళ్ళు ; మధ్యప్రదేశ్ లో పుట్టిన ఈ కలమాశి కోడిని కడకనాథ్ గా పిలుస్తారు. నల్లని మాసం కలిగి ఉంటుంది. నాటుకోడితో పోలిస్తే కడక్ నాథ్ కోడి మాంసంలో అధిక మాంసకృత్తులు ఉంటాయి. ఆరుమాసాల వయస్సు నుండే గ్రుడ్లు పెట్టటం ప్రారంభిస్తుంది. ఏడాదికి 100 నుండి 110 గ్రుడ్లను మాత్రమే పెడుతుంది. గ్రుడ్లకు , మాంసానికి మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది. పెరటి పెంపకానికి అనుకూలంగా ఉంటుంది.
గ్రామ ప్రియ కోళ్ళు ; అన్ని వాతావరణాల్లో ఈ కోళ్ళు పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. చూడటానికి ఆకర్షణీయంగా ఉండే గ్రామ ప్రియ కోళ్ళు పెరటి పెంపకానికి ఎంతో అనువైనవి. గ్రుడ్లు గోధుమ వర్ణన్ని కలిగి ఉంటాయి. ఆరునెల వయస్సునాటికి రెండున్న కేజీల బరువు పెరుగుతుంది. సంవత్సన్నర కాలంలో 250 గ్రుడ్లు పెడుతుంది. అధిక వ్యాధినిరోధక శక్తిని కలిగి ఉండటం వల్ల త్వరగా జబ్బుల బారిన పడవు.
స్వర్ణధార కోళ్ళు ; పెరటి వాతావరణానికి అనుకూలంగా ఉంటాయి. అధిక శరీర బరువును కలిగి ఉంటాయి. సంవత్సరానికి 190 వరకు గ్రుడ్లను పెడతాయి. గ్రుడ్ల ఉత్పత్తి కోసం ఎక్కవ మంది పెరటి కోళ్ళ పెంపకానికి స్వర్ణధార కోళ్ళను ఎంపిక చేసుకుంటారు.
ఇంటి పెరటి భాగంలో వీటిని పెంచాలనుకునే వారు అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపట్టాలి. వీటికి అనుకూలమైన వాతావరణం కలిపించాలి. అధిక వేడి లేకుండా షెడ్లు నిర్మించుకోవటం మంచిది. వాతావరణ పరిస్ధతిల్లో అనుహ్య మార్పులు ఏర్పడితే ఒక్కోసారి చనిపోయే అవకాశం ఉంటుంది. ఇంటి చుట్టూ నీడనిచ్చే చెట్లు ఉండేలా చూసుకోవటం మంచిది. తగినంత దాణాతోపాటు వ్యాధుల బారిన పడకుండా ముందస్తుగా టీకాలు ఇవ్వాలి. అన్ని జాగ్రత్తలు పాటిస్తే పెరటి కోళ్ళ పెంపకంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను సాధించటం సాధ్యమౌతుంది.
COMMENTS