Andukorralu : అండుకొర్రల సాగులో తెగుళ్ళ నివారణ
Andukorralu : మిల్లెట్ ఆహారానికి రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్న నేపధ్యంలో కొర్రల వంటి మిల్లెట్స్ సాగుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో అండు కొర్రలు సాగును చేపడుతూ రైతులు లాభాలు గడిస్తున్నారు. అండు కొర్రలు సమశీతోష్ణ వాతావరణ పరిస్ధితులకు అనుకూలమైన పంటగా చెప్పవచ్చు. బెట్ట పరిస్ధితులను సమర్ధ వంతంగా తట్టుకుంటుంది. అన్ని రకాల నేలల్లో అనుకూలమైన పంట. అండ్రుకొర్రలు అతి తక్కువ గ్లెసిమిక్ ఇండెక్స్ , పోషక విలువలు , అధిక పీచుపదార్ధం వల్ల మధుమేహం వ్యాధిగ్రస్తులకు అద్భుతమైన ఆహారంగా పరిగణిస్తున్నారు. అండుకొర్రల సాగు విషయంలో సరైన యాజమాన్య పద్దతులు పాటించటం ద్వారా రైతులు మంచి దిగుబడులతోపాటు లాభాలు పొందవచ్చు.
తెగుళ్ళు, చీడపీడల నివారణ ;
ఆకుమచ్చ తెగులు ; నీటి ఎద్దడి , పోషక పదార్ధాలు మొక్కకు అందినప్పుడు ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ శిలీంద్రం మొక్క అన్ని భాగాలకు ఆశిస్తుంది. ఆకులపై చిన్నచిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు ఈ మచ్చలు పెద్దవై ఒకదానితో ఒకటి కలిసి ఆకులు ఎండి రాలిపోతాయి. వెన్నుపై గింజ నిండుకోక తాలు గింజలు ఏర్పడతాయి. దీని నివారణకు మంకోజెబ్ 2.5గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పాముపొడ తెగులు ; ఈ వ్యాధి రైజోక్టోనియా సొలాని అనే శిలీంద్రం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు దుబ్బు చేసే దశ నుండి ఏదశలోనైనా ఆశించవచ్చు. ఆకులు మీద, కాండం మీద, చిన్నచిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడి అవి క్రమేపి పెద్దవై పాముపొడ వంటి మచ్చలుగా మారతాయి. దీని నివారణకు హెక్సాకనజోల్ 2మి.లీ లీటరు నీటికి లేదా ప్రొపికొనజోల్ 1మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
తుప్పు తెగులు ; ఆకుల అడుగు భాగంలో మరియు పై భాగాలపై పసుపు లేదా నారింజ రంగులో ఉండే బొబ్బల వంటి మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు క్రమంగా గోధుమ రంగు నుండి ముదురు గోధుమ రంగుకు మారతాయి. పై ఆకులపై తెగులు ఉధృతి ఎక్కువ. దీని నివారణకు పొలం గట్లపై కలుపు లేకుండా శుభ్రం చేయాలి. విత్తే ముందు కిలో విత్తనానికి 2.5గ్రా మాంకోజెబ్ తో విత్తన శుధ్ది చేయాలి. మాంకోజెబ్ 3గ్రా. లేదా ట్రైడిమార్ఫ్ 1మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
COMMENTS