కొమ్మ కొమ్మకో సన్నాయి.. మొక్కల ఆకుల నుంచి మెలోడి ట్యూన్స్
Melody tunes from the leaves of plants : మొక్కలు రోజంతా సూర్యరశ్మి, నీటి ఆవిరిని సంగ్రహించి కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనడం, ఆక్సిజన్ ఉత్పత్తి చేయడంతో తీరిక లేకుండా ఉంటాయి. అవి సృష్టించే ప్రాణవాయువు వల్లే భూమి మీద మనుషుల మనుగడ సాధ్యమని తెలిసిందే. అయితే అలాంటి మొక్కలు హాయిగొలిపే మెలోడీ మ్యూజిక్ కూడా అందిస్తాయని నమ్మిన జోయ్ అనే వ్యక్తి.. కొత్త టెక్నాలజీ సాయంతో ఆ సంగీతాన్ని ఆస్వాదించే అవకాశాన్ని కల్పించారు. ఈ క్రమంలోనే ‘ప్లాంట్వేవ్’ అనే పాకెట్ సైజ్ డివైజ్ను సృష్టించిన ఆయన.. ఇది మొక్కల ఆకులు ప్రతీరోజు జనరేట్ చేసే ప్రత్యేకమైన ‘సంగీతాన్ని’ వినడంలో సాయపడుతుందని తెలిపారు. రెండు సెన్సార్ల ద్వారా మొక్కల ఆకులకు కనెక్ట్ చేయబడే ఈ డివైజ్ ద్వారా.. ఇతర విశ్రాంతి ప్రదేశాల్లో వినిపించేటువంటి సంగీతం కాకుండా ప్రశాంతమైన మెలోడీలను వినవచ్చు.
ఇది ఎలా పని చేస్తుంది?
మొక్క ఆకులకు రెండు సెన్సార్లను అటాచ్ చేస్తారు. అప్పుడు చుట్టూ కదులుతున్న నీటి ఆధారంగా మొక్కలో చేటుచేసుకునే స్వల్ప వ్యత్యాసాలను ప్లాంట్వేవ్ గుర్తిస్తుంది. ఆ వైవిధ్యాలను తరంగాల రూపంలో గ్రాఫ్ చేసి, వాటిని సరైన పిచ్లోకి అనువదిస్తుంది. ఆపై వారు రూపొందించిన ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఆ పిచ్ మెసేజెస్ను ప్లే చేస్తారు. ఫలితంగా ఆహ్లాదకరమైన సంగీతం నిరంతరంగా వినిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, PlantWave పరికరం మొక్కల బయోరిథమ్స్ను ప్రశాంతమైన ట్యూన్స్గా అనువదిస్తుంది.అతని స్నేహితుడు ఇందుకు సంబంధించిన హార్డ్వేర్ డిజైన్ చేయగా.. మొక్కల నుంచి డేటా తీసుకొని వాటిని ట్యూన్స్గా మార్చే ‘జనరేటివ్ మ్యూజిక్ అల్గారిథమ్’ను జోయ్ రూపొందించాడు.
వావ్!
మొక్క జనరేట్ చేసే సంగీతం.. దానికి లభించే సూర్యకాంతి, నీటిపై ఆధారపడి ఉంటుంది. ఇవి సమృద్ధిగా లభిస్తే.. మొక్కల అంతర్గత పనితీరులో పెరిగిన వేగం మరింత ఉత్తేజకరమైన, సంక్లిష్టమైన సంగీతంగా అనువదించబడుతుంది. ఒకవేళ అనారోగ్యానికి గురై చనిపోతుంటే ఎటువంటి సంగీతాన్ని జనరేట్ చేయకపోవచ్చు. కాగా ఈ PlantWave డివైజ్ను ఇటీవలే ఫిలడెల్ఫియా మ్యూజియం ఆఫ్ ఆర్ట్లో ప్రదర్శించగా.. ఆహుతులను ఆశ్చర్యపరిచింది.
COMMENTS