KETO DIET: కీటో డైట్ తీసుకుంటున్నారా..? కొంచెం జాగ్రత్త
KETO DIET : కీటో డైట్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ఆహారాల్లో ఒకటి. శరీరం బరువు తగ్గించుకోవాలని ఉబలాట పడేవారు ఎక్కువగా కీటో డైట్ను ఫాలో అవుతుంటారు. ఈ డైట్లో అధిక కొవ్వు, ప్రోటీన్, చాలా తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారాన్ని తీసుకుంటారు. కార్బొహైడ్రేట్లు మన శరీరానికి కావలసిన శక్తి వనరులు. వీటిని తక్కువ స్థాయిలో అందించడం వల్ల దీర్ఘకాలంలో వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జట్టు రాలిపోవడం, చర్మం పాలిపోవడం వంటివి చూడవచ్చు.
మన శరీరం పనిచేయడానికి గ్లూకోజ్ అవసరం. ఈ గ్లూకోజ్ మనం తినే ఆహార పదార్థాల్లో ఉండే కార్బొహైడ్రేట్ల నుంచి లభిస్తుంది. ఫలితంగా శరీరానికి శక్తి లభిస్తుంది. అయితే, కోటో డైట్లో శరీరం గ్లూకోజ్ను కాకుండా కొవ్వును ఇంధనంగా ఉపయోగించుకుంటుంది. కీటో డైట్ని పాటించే వారు కొవ్వు ఎక్కువగా ఉండే మాంసం, చేపలు, నూనె పదార్థాలు, జున్ను, తక్కువ కార్బొహైడ్రేట్లు ఉండే కూరగాయలు ఎక్కువగా తీసుకుంటారు. కాగా, బ్రెడ్, పాస్తా, వరి అన్నం, ధాన్యాలు, పండ్లు, బంగాళాదుంప వంటి పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న వాటిని తక్కువగా తింటుంటారు.
ఇవీ దుష్ప్రభావాలు..
కీటో డైట్ ద్వారా బరువు తగ్గడం తాత్కాలికం. శరీరంపై ఒత్తిడి పడటంతో తక్షణమే బరువు తగ్గుతుంది. ప్రోటీన్, ఇతరత్రా అవసరమైన పోషకాలు అందకపోవడం వల్ల జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. కీటో డైట్ మన గట్ బ్యాక్టీరియాపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఈ ఆహారంలో అవసరమైన పోషకాలు ఉండవు. ఫలితంగా చర్మం దెబ్బతింటుంది. నేరుగా చర్మంపై దద్దుర్లు, ఇతర చర్మ సంబంధ సమస్యలకు కారణమవుతుంది.
సూక్ష్మ, స్థూల పోషకాలతోపాటు విటమిన్ల సాయంతో మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అదే కీటో డైట్ని అనుసరిస్తున్న వారిలో ఈ పోషకాల కొరత ఏర్పడుతుంది. ఈ ముఖ్యమైన పోషకాలు మెదడు, గుండె, కాలేయానికి అందాలి. అలాగే, చర్మం, జుట్టు పోషణకు అవసరం. పోషకాల లోపం మొదట చర్మం, గోర్లు, జుట్టుపైన కనిపిస్తుంది. బరువు తగ్గేందుకు కీటో డైట్ను ఫాలో అవడానికి ముందుగా ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీర్ఘకాలంపాలు ఈ డైట్ను ఫాలో అవడానికి ముందు దాని ప్రతికూలతలపై కూడా దృష్టి పెట్టాలి.
- శరీరానికి తగినంత శక్తి అందకపోవడం వల్ల తీవ్రమైన అలసట మనల్ని ఆవరిస్తుంది.
- ఈ విధానంలో బరువు తగ్గేవారు కొన్ని నెలల వ్యవధిలోనే తిరిగి పొందే అవకాశాలు ఉంటాయి.
- అధిక దాహానికి దారితీస్తుంది.
- మలబద్దకం సమస్యలు వస్తుంటాయి.
- మూత్రపిండాల సమస్యలు వేధిస్తాయి.
- గుండె సంబంధ వ్యాధులు తలెత్తే అవకాశాలు అధికంగా ఉంటాయి.
- ఈ డైట్ను కేవలం పోషకాహార నిపుణుల పర్యవేక్షణలోనే అమలు చేసుకోవడం చాలా ముఖ్యమైందని గుర్తుంచుకోవాలి.
COMMENTS