అలోవెరా సాగుతో లక్షల్లో ఆదాయం
Income in lakhs with aloe vera cultivation : ప్రస్తుత కాలంలో అలోవెరాకు డిమాండ్ పెరుగుతోంది. బ్యూటీ ప్రొడక్ట్స్, సబ్బులు, క్రీములు, లోషన్ల తయారీలో అలోవెరా వాడుతారు. అందువల్ల ఈ మొక్కలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కొన్ని కంపెనీలు కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ సాగును రైతులతో చేయించుకుంటున్నాయి. మీరు వ్యాపార కోణంలో అలోవెరా సాగు చేపడితే ఏడాదికి రూ.8 నుంచి రూ.10 లక్షల దాకా ఆదాయం వస్తుందని చెబుతున్నారు.
మీరు అలోవెరా ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించాలనుకుంటే మీకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ (CIMAP) కొన్ని నెలల పాటు శిక్షణనిస్తుంది. ఇందుకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది. కొద్ది మొత్తంలో ఫీజు చెల్లించాక ట్రైనింగ్ మొదలవుతుంది. అలోవెరా సాగుకు భారత్ లోని వాతావరణం బాగా సెట్ అవుతుంది. విపరీతమైన ఎండలు అవసరం లేదు. సాధారణ ఎండ ఉన్నా పెరుగుతుంది. మరీ ఎక్కువ నీరు అవసరం లేదు. ఏడాది పొడవునా పెరుగుతుంది. విపరీతమైన చల్లదనం ఉంటే మాత్రం మొక్క పెరగడానికి ఇబ్బంది పడుతుంది. ఎలాంటి నేలలోనైనా ఇది పెరగగలదు. ఇసుక రకం నేలలైతే ఈ మొక్కకు బాగా సెట్ అవుతాయి. నల్ల నేలలో కూడా బాగా పెరుగుతుంది. భూగర్భ జలాలు కాస్త ఎక్కువగా ఉండే నేలను ఎంచుకోవాలి. అలాగే మొక్కల దగ్గర నీరు నిల్వ ఉండకుండా ఏర్పాట్లు చేసుకోవాలి. జూలై నుంచి ఆగస్ట్ మధ్య ఈ మొక్కల్ని నాటాలి.
ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR) ప్రకారం.. ఒక హెక్టార్ సాగుకి రూ.27,500 ఖర్చు అవుతుంది. కూలీలకు వేతనాలు, సాగు ఏర్పాట్లు, పురుగు మందులు అన్నీ కలిపి మొత్తం ఏడాదికి ఖర్చు రూ.50,000 దాకా అవుతుంది. హెక్టార్ పొలంలో ఏడాదికి 40 టన్నుల నుంచి 50 టన్నుల అలోవెరా ఆకులు వస్తాయి. మీరు ఆయుర్వేద కంపెనీలు, కాస్మెటిక్, సబ్బుల తయారీ కంపెనీలకు వాటిని అమ్మవచ్చు. ఆకులు మందంగా, పెద్దగా ఉంటే వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. చాలా చోట్ల టన్ను ఆకులకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు ఇస్తున్నారు. అందువల్ల మీకు ఏడాదికి రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా ఆదాయం వస్తుంది.
COMMENTS