గ్రహణాలు - అపోహలు- వాస్తవాలు : జనవిఙ్ణానవేదిక
Eclipses - Myths - Facts: గ్రహణం చుట్టూ ఇలాంటి తేలికపాటి అంశాలతో పాటు జుగుప్స కలిగించే అనేక ఇతర అశాస్త్రీయ అంశాలు కూడా జోడించబడి ఉన్నాయి. గ్రహణ సమయంలో గర్భిణీలు బయటికి వస్తే పిల్లలు గ్రహణ మొర్రితో పుడతారనీ, గ్రహణం సమయంలో అన్నం తినకూడదనీ, గ్రహణ సమయంలో దేవాలయాలను మూసివేయాలనీ, గ్రహణాన్ని చూస్తే కళ్లు పోతాయనీ, గ్రహణ సమయంలో అధిక మోతాదులో అతినీలలోహిత కిరణాలు (ultraviolet radiation) వెలువడతా యనీ గ్రహణం సమయంలో పుట్టిన వారికి బుద్ధి పెరగదనీ ఇలా పలురకాల అపవాదుల్ని గ్రహణానికి ఆపాదించారు.
గ్రహణం సౌరగ్రహణం (solar eclipse) అయినా చంద్రగ హణం (lumar eclipse) అయినా వాదనలు, అపోహలు మాత్రం ఒక దేశంలో దాదాపు ఒకే విధంగా ఉంటాయి. తమాషా ఏమిటంటే గ్రహణం అందరికీ ఒకే విధంగా ఉన్నా గ్రహణం గురించిన అశాస్త్రీయ ఆపాదనలు మాత్రం వేర్వేరుగా ఉంటాయి. భారతదేశంలో గ్రహణానికి సంబంధించి దాదాపు దేశమంతటా ఉన్న అపోహ (హిందూమతం అంగీకరించే వారి వాదన) ఇలా ఉంటుంది. అమృతం కోసం క్షీరసాగర మథనం జరుగుతున్న సందర్భంగా అమృతం వెలువడుతుంది. అమృతాన్ని పంచుకోక ముందే దొంగచాటుగా తాగడానికి రాహువు, కేతువు అనే దిక్పాలకులు లేదా రాక్షసులు ప్రయత్నిస్తారు. రాహువు చేసే అమృత చౌర్యాన్ని సూర్యుడు, కేతువు చేసే చౌర్యాన్ని చంద్రుడు పసిగడతారు. వారు విష్ణువుకు ఫిర్యాదు ఇస్తారు. వెంటనే విష్ణువు ఆ రాహువు, కేతువుల గొంతును దాటి అమృతం పొట్టలోకి పోకముందే (పోతే అందరికీ ప్రమాదమట) చక్రంతో శిరస్సు ఖండిస్తాడు. తద్వారా కేవలం తలలు మొండాన్ని వీడిపోతాయి. అమృత స్పర్శ తాకడం వల్ల తలలు ప్రాణంతో ఆకాశంలో సంచరిస్తుంటాయి.(గ్రహల్లాగా). హిందూమతం ప్రకారం నవగ్రహాల్లో రాహువు, కేతువులు ఇద్దరిదీ పరిగణన ఉంది. ఆ వాదన ప్రకారం సూర్యుడు, చంద్రుడు కూడా గ్రహాలే. వీరంతా భూమి చుట్టూ తిరుగుతుంటారని (Geocentric Theory) భూకేంద్ర సిద్ధాంతానికి అనుకూలముగా పరిగణిస్తారు.
తమను పట్టించారన్న అక్కసుతో రాహువు సూర్యుణ్ణి, కేతువు చంద్రుణ్ణి మింగుతారు. కాబట్టి వారి మింగుడు సమయంలో సౌరగ్రహణం, చంద్రగహణం సంభవిస్తాయి. కానీ గొంతులు దాటాక మొండాలు లేవు. కాబట్టి ఇటు నోట్లోంచి వెళ్లి కాసేపు కనుమరుగయిన సూర్యుడు (సౌరగ్రహణ సమయంలో) చంద్రుడు (చంద్రగహణ సమయంలో) అటు నుంచి గొంతు బయటికి వచ్చేస్తారు.
అమెరికా వంటి దేశాల్లో సూర్యచంద్రుల్ని తోడేళ్లు తింటాయి. ప్రాచీన చైనాలోనూ, అశాస్త్రీయ నమ్మకాలున్న చైనా ప్రజల్లోనూ డ్రాగన్ సూర్యుణ్ణి, చంద్రుణ్ణి తింటుంది. జీర్ణం కాకపోవడం వల్ల తిరిగి అవి మలద్వారం ద్వారా తిరిగి బయటపడతాయి. కాబట్టి ఆ రోజు మలినపడ్డ వెలుగు కాబట్టి ఈ వెలుగులో బయటికి రాకూడదు. మల స్పర్శ పొందిన సౌరకాంతి, చంద్రకాంతి అనా రోగ్యాన్ని కలిగించేవి. ఆహారం పంకితం అవుతుంది. రాహువు, కేతువు విషయాలు సూర్యచంద్రులు ఎంగిలి కాబడ్డారు. కాబట్టి ఆ వెలుగులో ఆహారం తింటే రోగాలు వస్తాయని భారతదేశంలో అశాస్త్రీయ వాదన ఉంది.
మరికొన్ని దేశాల్లో పెద్ద గోదురు కప్పలు సూర్యుణ్ణి, చంద్రుణ్ణి మింగడం వల్ల గ్రహణాలు వస్తాయని నమ్ముతారు. ఇతర కొన్ని దేశాల్లో చంద్రుణ్ణి, సూర్యుణ్ణి దొంగలు కిడ్నాప్ చేయడం వల్ల గ్రహణాలు వస్తాయని నమ్ముతారు. ఇలా నమ్మకాలు వేర్వేరుగా ఉన్నా నిజానిజాలేమిటో శాస్త్ర పరిజ్ఞానం తేటతెల్లం చేసింది. సూర్యునికీ, భూమికీ మధ్య చంద్రుడు అడ్డు వస్తే సూర్యగ్రహణం వస్తుందనీ, ఎపుడో గానీ ఇలా సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖ మీదుగా సంభవించవనీ, అందుకే సూర్యగ్రహణాలు చాలా అరుదుగా వస్తాయనీ సైన్సు చెబుతోంది. అలాగే సౌరకాంతి చంద్రుడి మీద పడకుండా సూర్యుడికీ, చంద్రుడికీ మధ్యలో భూమి రావడం వల్ల చంద్రుడు కనిపించపోవడాన్నే చంద్రగ్రహణం అంటారనీ సైన్స్ తేటతెల్లం చేసింది. ఇలా సూర్యుడికీ, చంద్రుడికీ మధ్యలో భూమి ఉండేలా ఒకే సరళరేఖలోకి రావడం సౌరగ్రహణం కన్నా ఎక్కువ అవకాశాలున్నాయని అందుకే చంద్రగ్రహణాలు ఎక్కువసార్లు వస్తాయనీ, చంద్రుడి సైజుకన్నా భూమి సైజు చాలా ఎక్కువ కాబట్టి సౌరగ్రహణం వ్యవధి నిముషాలకే పరిమితం కాగా చంద్రగ్రహణపు వ్యవధి గంటలతరబడి ఉంటుందని ఖగోళ పరిజ్ఞానం పూర్తిగా వివరించింది. ఇన్ని నిజాలు తెలిశాక కూడా ప్రజల మూఢనమ్మకాలే సొమ్ముగా అధికారాల్ని చలాయిస్తున్న మత వాదులు, సనాతన ఛాందసత్వ వాదుల సైన్సు పదాల్ని వాడి గ్రహ ణాల గురించి గతంలో ఉన్న పూర్తి అబద్ధపు వాదనలకు ఆమోద ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. దౌర్భాగ్యం ఏమిటంటే కొన్ని నక్షత్రశాలల్లో గ్రహణాల్ని గురించిన ప్రదర్శనలలో మతపరమైన అసత్యాల్ని సమర్ధించే విధంగానే పదజాలం, వివరణ ఉంటున్నది.
గ్రహణ సమయంలో అదో వింతగా ఉంటుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్లు సూర్యగ్రహణాన్ని అదేపనిగా చూస్తుంటారు. ఉన్నట్టుండి కొన్ని నిముషాల్లోనే గ్రహణస్థితి నుంచి బయటపడ్డాక తేజోవంతమైన సౌరకాంతి కంటి రెటీనాపై అవాంఛి తమైన ప్రభావం కలిగిస్తుంది. కాబట్టి అపోహలకు ఆధారం దొరికింది. జనవిజ్ఞాన వేదిక, తదితర సంస్థలు సరఫరా చేసే సౌర ఫిల్టర్ల ద్వారా గానీ, ఇతర రక్షిత పద్ధతుల ద్వారా గానీ అద్భుత మయిన సౌరగ్రహణాన్ని చూసే అరుదయిన అవకాశాన్ని జారవిడుచోకూడదు.
గ్రహణాల సమయంలో ఆహారపు పోషక విలువలు తగ్గిపోతాయని అనడంలోను, విటమిన్లు వినాశనమ వుతాయని అనడంలోనూ ఏమాత్రం వాస్తవం లేదు. గ్రహణ సమయంలో దేవాలయాలు తెరిస్తే ఏమీకాదు, భోజనం తింటే ఏమీ కాదు. గర్భిణీలు తిరిగితే ఏమీ కాదు. గ్రహణాల గురించిన అపోహలకే గ్రహణం పట్టిద్దాం.
>>>>> CLICK HERE TO DOWNLOAD
COMMENTS