ఆషాఢం అంటే అందరూ అశుభం అని అనుకుంటారు.
ఆషాఢం శుభకార్యాలకు అనువైనదికాదని అంటారు. కానీ వివాహం అయిన కొత్త పెళ్లి కూతురుని పుట్టింటికి తీసుకొచ్చేది ఈ మాసమే. తొలి ఏకాదశి వచ్చేది ఇదే ఆషాడంలోనే. జగన్నాథ రథ యాత్ర జరిగిదే ఆషాఢంలోనే. గురుపౌర్ణమి ఆషాఢంలోనే వస్తుంది. తెలంగాణలో బోనాలు కూడా ఈ మాసంలోనే జరగడం మరో విశేషం. ఆషాఢ మాసం శుభకార్యాలకు మంచిది కాకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథ యాత్రలు, పల్లకి సేవ వంటి పెద్దపెద్ద శుభకార్యాలకు ఇది మంచిది కాబట్టి ఆలయాలు భక్తులతో రద్దీగా ఉంటాయి. పండితులంతా పూజల్లో ఉంటారు. దీంతో వాళ్లు పెళ్లి తంతు చేయడానికి టైమ్ ఉండదు. అంతే కాకుండా ఆషాఢంలో సప్త ధాతువులు సరిగా పనిచేయకపోవడం, వర్షాలు కురవడంతో పొలం పనులు అధికంగా ఉండటం, ప్రత్యేకించి శూన్య మాసం కావడంతో పాటు దీక్షకు సంబంధించిన మాసం కావడం వల్ల ఆషాఢంలో గర్భధారణకు అనుకూలమైన మాసం కాదని పురాణాలు పేర్కొంటున్నాయి.
అందువల్ల ఈ మాసంలో పెళ్లిళ్లు చేయరు. కొత్తగా పెళ్లైన అమ్మాయి అత్తగారింట్లో ఉండకూడదు. అందుకే పుట్టింటికి పంపుతారు. కొత్తగా వివాహమైన భార్యాభర్తలు ఆషాఢంలో విడివిడిగా ఉండటానికి చాలా కారణాలున్నాయి. ఆషాఢంలో భార్యాభర్తల కలిస్తే గర్భం వస్తుంది. ఆ సమయంలో గర్భం వస్తే వేసవిలో కాన్పు ఉంటుంది. అంటే వేసవిలో బిడ్డకు జన్మనివ్వడంతో ఎండ తీవ్రతకి బిడ్డకు, తల్లికి అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఆషాఢంలో భార్యను దూరంగా పెడతారు. అలాగే ఆషాఢంలో దేవుళ్లు నిద్రలోకి వెళ్తారట. దీంతో వివాహం చేసుకుంటే వారి ఆశీస్సులు అండవట. దక్షిణ భారతంలో ఆషాఢంలో ఏ పంట చేతికిరాదు. మ్యారేజ్ చేయడానికి పైసలుండవు. దీని వల్ల కూడా ఆషాడంలో వివాహాలు జరగవు. ఆషాడంలో గాలి వానలు ఎక్కువ. దీంతో వివాహాలకు ఆటంకాలు వస్తాయి.
అందుకే ఆషాఢంలో వివాహాలు నిర్వహించరు. ఆషాఢ మాసం రాగానే మహిళలు గోరింటాకు పెట్టుకోవడం మన తెలుగు నాట ఆచారం. గోరింటాకు గౌరీదేవికి ప్రతీకగా భావిస్తారు. గౌరి ఇంటి ఆకునే గోరింటాకుగా మన పురాణ కథలు తెలియజేస్తున్నాయి. ఆషాఢ మాసంలో అధిక వర్షాలు, నీటిలో మార్పులు రావడం సంభవిస్తాయి. రోగాలు, క్రిములు పెరిగే మాసం కూడా ఇదే. అందువల్ల మహిళలు నీటితో ఎక్కువగా పనిచేయడంతో ఈ గోరింటాకు పెట్టుకుంటే వారు అనారోగ్యం బారినపడకుండా ఉంటారని ఆయుర్వేదం తెలియజేస్తోంది. గోరింటాకును మహిళలు పెట్టుకోవడం వల్ల గర్భాశయానికి సంబంధించిన దోషాలు తొలగి ఆరోగ్యం సిద్ధిస్తుందని పురాణాలు, ఆయుర్వేద శాస్త్రం చెబుతున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం శూన్య మాసాల్లో శుభకార్యాలు (వివాహం, ఉపనయనం, గృహారంభ ప్రవేశాలు వంటివి) చేయరు.
ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశి.. తొలి ఏకాదశి. ఈ ఏకాదశి హిందువులకు అత్యంత పవిత్రమైనది. ఆషాఢ పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా పాటిస్తారు. చాతుర్మాస దీక్షలు ఈ మాసంలోనే ప్రారంభమవుతాయి. శ్రీ మహా విష్ణువు ఆషాఢ మాసంలో శయనిస్తాడు. ఆషాఢం నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు మహా విష్ణువు శయనంతో ఈ నాలుగు మాసాల్లో తేజం తగ్గడం వల్ల దీనికి శూన్య మాసం అని పేరు. ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ షష్ఠిని స్కంద వ్రతం అంటారు. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వరుడిని పూజించి ఆలయాలను దర్శించుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరాధన వల్ల వంశాభివృద్ధి జరిగి కుజదోషం, కాలసర్పదోషం తొలగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆషాఢ అమావాస్య రోజున దీప పూజ (దీపాన్ని వెలిగించి పూజచేయడం) చేస్తారు. అమావాస్య రోజున దీపపు కుందెలు శుభ్రం చేసి ముగ్గుపై దీపాన్ని నిలబెట్టి పసుపు, కుంకుమతో పూజిస్తారు. ఆ రోజు సాయంత్రం ఇంటికి నలువైపులా దీపాలు పెట్టడం వల్ల లక్ష్మీప్రదమని పురాణాలు పేర్కొంటున్నాయి.
COMMENTS